హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సీపీఎం జాతీయ, రాష్ట్ర నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, సర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. నాగయ్య మాట్లాడుతూ.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజ్యాంగ సూత్రాలను విస్మరించి, కేంద్ర ప్రభుత్వానికి ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీలో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తున్న పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు, అరుణకుమార్, జాన్ వెస్లీ, జ్యోతి తదితరులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయాలైన సూర్జిత్ భవన్, ఏకేజీ భవన్‌లపై పోలీసులు దాడి చేసి, నాయకులను నిర్బంధించడాన్ని ఖండించారు. దేశవ్యాప్తంగా ముస్లింలు, క్రిస్టియన్లు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందిన 13 కోట్ల ఓట్లను ఉద్దేశపూర్వకంగా రద్దు చేశారని ఫైర్ అయ్యారు. స్వతంత్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
